జీవితంలో కస్టాలు, సమస్యలు, నిరాశలు ఎదురైనప్పుడు నమ్మకం కోసం ప్రార్ధన
ప్రేమమైయుడైన ప్రభువా, జీవితంలో నేను మోస్తున్న భారాలు మరియు వచ్చే నిరాశలు, నిస్పృహలు
భరించలేనట్లు అనిపిస్తుంది. ప్రభూ, నా రోజువారీ పనులు ప్రతి వారం గడిచేకొద్దీ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది తండ్రి, మరియు నేను ఎంత ఎదుర్కోవాలని చూసినా నాలోని సహనాన్ని కోల్పోతున్నాను ప్రభువా. దయగల దేవా, నా యొక్క కుటుంబము కొరకు, నా భార్యా పిల్లల కొరకు నేను ఏమి చేయలేక పోతున్నాను తండ్రి. నా కుటుంబము పట్ల నేను చేయవలసిన బాధ్యత నేను ఎప్పుడూ చేయలేను అని నా మనసులో నేను మదన పడుతున్నాను. అనేక కష్టాలతో నా మనసు సతమతమౌతుంది ప్రభువా. ఇలాంటి కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి గాని తగ్గటలేదు ప్రభువా. ఇవన్నీ తలచుకొని అనుక్షణం నేను చింతిస్తున్నాను.
తండ్రి కొన్నిసార్లు ముందుకు వెళ్ళే మార్గం చాలా స్పష్టంగా అనిపిస్తుంది, కాని ఇతర సమయాల్లో మార్గం అనిశ్చితంగా కప్పబడి ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ముందుకు వెళ్లే రహదారి ప్రశ్నార్థక నీడలలో దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. నన్ను ముందుకు నడిపించండి. ఈ సమస్యలను బాధలను, నిరాశలను ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించండి. దయగల ప్రభువా, ఇలాంటి కష్టతరమైన పరిస్థితులలో నన్ను సరైన మార్గంలో నడిపించండి, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో ఉంటానని మీరు వాగ్దానం చేసారు ప్రభువా, ఎందుకంటే నేను తీసుకునే అడుగులు మీకు తెలుసు. నేను మీపై అపారమైన నమ్మకమును
కలిగిఉండునట్లుగాను కేవలం నిన్ను మహిమపరిచే కార్యములను మాత్రమే చేయునట్లుగాను నన్ను ఆశీర్వదించండి.
కష్ట సమయాల్లో నాకు ఓదార్పునివ్వండి. ప్రజలు నన్ను విడిచిపెట్టినప్పుడు నాకు ధైర్యమును దయచేయండి. నా స్నేహితులు నన్ను విడిచిపెట్టినప్పుడు, మీరు నాకు తోడుగా ఉండండి. నేను చేసే పనులు విఫలమైనప్పుడు, నాలోని సహనము కోల్పోకుండా నాలో ఉత్సాహాన్ని నింపండి. ప్రజలు నా గురించి చెడుగా చెప్పినప్పుడు, నా యొక్క పేరును, గౌరవాన్ని తూలనాడినప్పుడు, వారిని క్షమించే మంచి హృదయాన్ని గుణాన్ని నాకు దయచేయండి. మహిమగల దేవా, నిరాశ, నిస్పృహలతో ఉన్నవారికి మీరు ఆశాకిరణం.