దుష్టుల నుండి, శత్రువుల నుండి కాపాడుటకు ప్రార్ధన
అందరిని క్షమించే
కరుణ హృదయము గల తండ్రి, నేను దుష్టుల
ఆలోచనచొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు
కూర్చుండు చోటను కూర్చుండక, నా యొక్క
కాలాన్ని వృధా చేయకుండా ఉండేటువంటి మంచి ఆలోచనలను నాకు దయచేయండి. నేను ఎల్లవేళలా
మీ యొక్క వాక్యము పఠించి హృదయానందమును
పొందు భాగ్యమును నాకు అనుగ్రహించండి. మీరు పరిశుద్ధ గ్రంధములో సెలవిచ్చునట్లు,
మీ వాక్యమును ఎల్లప్పుడూ
చదివి ఆచరించువాడు, ధ్యానించువాడు ధన్యుడు. మా జీవితములోను మేము మీ
యొక్క పరిశుద్ధ వాక్యమును చదివి, హృదయాంతరాలలో
వాటి యొక్క అర్ధములను భావములను నింపుకొనే భాగ్యమును మాకు అనుగ్రహించండి.
దయగల తండ్రి,
నీతిమంతుల మార్గము మీకు తెలియును. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అనే
వాక్యములను మా జీవితములో అర్ధము చేసుకొని మీకు నచ్చిన రీతిలో జీవించే శక్తిని మాకు అనుగ్రహించండి.
మా తండ్రి,
దైవ గ్రంధములో మీరు
పలికిన విధంగా, "ఇనుపదండముతో నీవు
వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా
పగులగొట్టెదవు" నా యొక్క వినాశనమును కోరే నా శత్రువులను క్షమించి, మారు మనస్సు పొందే విధముగా వారి హృదయాలను
తాకండి . వారిని శపించే మనస్సును, ఆలోచనను నా నుంచి తీసివేయుము తండ్రి. మీ
కుమారుడు యేసు నాధుడు ఏ విధముగా తనకు అపకారము చేసే వారిని క్షమించెనో అదే విధంగా
నాకును క్షమించే గుణాన్ని దయచేయండి. మీ యందు సదా
కాలము భయభక్తులు కలిగి మిమ్ము మా యొక్క
ప్రార్ధనల ద్వారా, మంచి కార్యముల
ద్వారా సేవించే భాగ్యమును మాకు కలుగజేయుము.
నన్ను
బాధించువారు ఎంతో విస్తరించియున్నారు ప్రభువా.
నామీదికి లేచువారు, నాకు అపకారము తలపెట్టువారు అనేకులు. నా యొక్క బాధా హృదయముతో ఎలుగెత్తి
నేను మీకు మొఱ్ఱపెట్టుచున్నాను తండ్రి.
మీరే నాకు ఆధారము, కావున ఎవరు ఏ అపకారము తలపెట్టాలని చూచినా నేను భయపడను ప్రభు. మీరు నాకు తోడుగా
ఉన్నారు అనే గట్టి విశ్వాసము కలిగి ఉండునట్లు నాకు మీ యొక్క అనుగ్రహాన్ని
దయచేయండి. దయగల దేవా, పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి
మోహరించినను నేను భయపడను. మీరే నాకు కవచమై నన్ను కాచి కాపాడును. నా దేవా నన్ను
రక్షింపుము. నా శత్రువులనందరిని
తరిమికొట్టే శక్తి సామర్ధ్యాలు కలిగిన వాడవు
నీవే, దుష్టుల యొక్క దుష్ట కార్యముల నుండి నన్ను కాపాడువాడవు నీవే. ఈ విధమైనటువంటి బలమైన
విశ్వాసమును మీ యందు కలిగి ఉండునట్లు నన్ను ఆశీర్వదించండి. మా నాధుడైన యేసు నాధుని
ద్వారా ఈ నా మనవిని ఆలకించుము తండ్రి.